Breaking News

ఇదే క‌దా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌ర్వ‌ప‌డే అంశం!

 


త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు సాగించిన పాద‌యాత్ర 'ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌' ప్రారంభ‌మై మూడేళ్లు గ‌డుస్తున్నాయి, అందుకు సంబంధించి సోష‌ల్ మీడియాలో సంబ‌రాలు చేసుకుంటూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

మూడేళ్ల కింద‌ట ఇదే రోజున ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సుదీర్ఘ ప‌య‌నంగా ఆ యాత్ర‌ను సాగించాడు. ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు కాక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ వారంలో ఆరు రోజుల పాటు యాత్ర‌ను సాగించారు.

అటు ఇటు దాదాపు ఏడాదికి పైనే ఆ యాత్ర సాగింది. ఆ యాత్ర అంతిమ‌గమ్యాన్ని చేరింది, జ‌గ‌న్ త‌ను అనుకున్న‌ది సాధించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఒక్కసారి ముఖ్య‌మంత్ర‌య్యాకా.. అంత‌కు ముందు ప‌డిన క‌ష్టాల గురించి, ముఖ్య‌మంత్రి అయ్యేందుకు చెప్పిన మాట‌ల గురించి కొంద‌రు గుర్తు చేసుకోరు. ప‌ద‌వి కోసం ఎన్నో మాట‌లు చెప్పి ఉంటారు, ప‌ద‌వొచ్చాకా గ‌తాన్ని గుర్తు చేస్తే అప్పుడు చెప్పిన మాట‌ల గురించి నిల‌దీత‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

అందుకే గ‌తాన్ని రాజ‌కీయ నేత‌లు గుర్తు చేసుకోరు, తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చేసిన డిమాండ్లు, ఇచ్చిన మాట‌ల‌ను ప్ర‌స్తావించ‌రు. ఇందుకు పూర్తి విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు త‌మ అధినేత ఏం చెప్పార‌నే అంశం గురించి ప్ర‌స్తావించగ‌లుగుతోంది!

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ చెప్పి మాట‌లు, ఇచ్చిన హామీల‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గుర్తు చేస్తోంది. నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను ఇప్పుడు పాల‌కుడిగా అమ‌లు చేస్తున్నారంటూ గ‌ర్వంగా చెప్పుకోగ‌లుగుతోంది. అందులో భాగంగానే పాద‌యాత్ర ప్రారంభానికి, ముగింపుకు వార్షికోత్స‌వాలు జ‌ర‌ప‌గలుగుతోంది.

ఎన్నిక‌ల్లో నెగ్గ‌గానే.. మెనిఫెస్టోని త‌మ వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేక‌, జ‌నాలు నిల‌దీస్తార‌నే భ‌యంతో .. టీడీపీ మెనిఫెస్టోని డిలీట్ చేసి.. క‌ళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిచందాన వ్య‌వ‌హ‌రించింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాత్రం.. 'నేను విన్నాను.. నేను ఉన్నాను..' అంటూ ఇచ్చిన మాట‌ల వీడియోల‌ను ప‌దే ప‌దే ప్ర‌ద‌ర్శించుకోగ‌లుగుతోంది! ఇదీ.. చంద్ర‌బాబు పాల‌న‌కూ, జ‌గ‌న్ జ‌మానాకూ క‌నిపిస్తున్న ప్ర‌ధాన వ్య‌త్యాసం! రాబోయే రోజుల రాజ‌కీయాన్ని కూడా నిస్సందేహంగా ప్ర‌భావితం చేసే అంశ‌మిది.

                                                                                                   - https://telugu.greatandhra.com

No comments